28, సెప్టెంబర్ 2014, ఆదివారం

చట్టం తన పని తను చేస్తుంది...

చట్టం తన పని తను చేస్తుంది...
చట్టం ఎప్పుడూ బతికే ఉంటుంది
అంటూ వేదికలపై వ్యంగంగా మాట్లాడే నేతలకు
"జైలులలిత" సంఘటన ఓ పెద్ద హెచ్చరిక...
అవినీతిపరులు కొందరు చట్టాన్ని చుట్టంగా
మార్చుకుందామని చూస్తుంటారు
దాన్నిపట్టుకుంటే కాలుతుందని తెలియక
చాలా మంది నేతలు ఏదేదో నీతి కబుర్లు వల్లిస్తుంటారు
దొరకనంత వరకే వారు దొరలు
చట్టానికి దొరకకుండా జాగ్రత్త పడతూ
నంగనాచి కబుర్లు చెబుతుంటారు
నిజంగా ఏ రాజకీయ నాయకుడు
నీతిమంతుడో చెప్పండి చూద్దాం
సక్రమంగా ఎంత మంది సంపాదిస్తున్నారు
రాజకీయాల్లోకి రాకముందు వారు ఆస్తులెంత
ఆ తర్వాత వారి ఆస్తులెంత నిజాయితీగా చెప్పమనండి
వీరిని ప్రశ్నించే ధైర్యం ఎవరికుంది..?
నిజంగా ప్రజా సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారు..?
ఇప్పుడున్న రాజకీయాల్లో సక్రమంగా ఎన్నికైన వారు ఎంతమంది..?
డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికైన నేతను నేను అని గుండెలుమీద చెయ్యి వేసుకుని చెప్పే దమ్ము ఎవరికుందో చెప్పమనండి చూద్దాం...?
ప్రజలను ఏమార్చేందుకు మీడియా ముందుకొచ్చి నాలుగు డైలాగులు చెబితే పిచ్చి ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారు నేతలు
సమయం వస్తే చావగొట్టి సమాధి చేస్తారని తెలియదా వారికి
నిజంగా ప్రజాసేవే పరమార్ధం అనుకునే వారయితే
ఏడాదికో పార్టీ ఎందుకు మారుతున్నారు చెప్పండి
వీరికి ప్రజాసేవ కంటే పవరే ముఖ్యం
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డమైన గడ్డీ తింటే
ఎవరికైనా అరదండాలు తప్పవు మరి...
ఒకరిని విమర్శించే ముందు నీవు ఎంత నీతిపరుడవో ఓ సారి మననం చేసుకుంటే మంచిది మరి
ఒకరిని మరొకరితో పోల్చడం సరికాదు అని తెలుసుకుంటే మంచిది
మీరు ఒకరిని విమర్శించే ముందు
మీ అధినేతలూ, మీరూ ఎంత నీతిపరులో ముందు తెలుసుకోండి
అడ్డంగా వాదించి అడిగిన వాడు వెధవకాదా అని ప్రశ్నించకండి
మీకు సమయం కలిసొచ్చింది కదా అని కల్లు తాగిన కోతిలా  మీడియా ముందు ఎగరి గంతులేయకండి
సమయమనం ప్రతినేతకు అవసరమని తెలుసుకుని ప్రవర్తించండి
మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పోరాడే నేతలు ఎంత మంది ఉన్నారో చెప్పండి
సత్యమేవ "జయ"తే అంటూ రాష్ట్రంలో "ప్రకాశి"ద్దామనుకున్న నేత చివరకు వికసించకుండానే నేత నీతి కబుర్లతోనే చాలించేశాడు
తప్పు చేస్తే... న్యాయ దేవత.. ఎవ్వరిని వదిలిపెట్టదు
కాకపొతే, ఆలస్యం అవుతుంది
దేశంలోఅ కనీసం రాష్ట్రానికి ఒక సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వారు కావాలి తప్పు చేసిన వారిని బోనేక్కించాలి..
ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు.ఎంతటి వారయినా అడ్డ దారులు తొక్కితే జైలు కూడు తినాలి.
తప్పు చేస్తే,జైలుకు వెళ్ళాల్సిందే.డబ్బు పొగరు,అధికారంఅహంకారం శిక్షలను తగ్గించలేవు.అడ్డు కోలేవు..డబ్బు,అధికారం ఉంటే,ఎంతటి నేరాన్ని చేసినా సులభంగా తప్పించు కోవచ్చు,అనే నానుడికి తావు లేకుండా చేయాలి  సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్తాయిలో ఉన్న వ్యక్తి జైలుకు పంపించడం ద్వారా చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు అని,తనకు తాను భారతదేశ ప్రజల ముందు న్యాయ దేవత నిరూపించుకుంది. చట్టం ముందు అందరూ సమానమే. మన దేశంలో సైతం తప్పు చేస్తే,ముఖ్యమంత్రి అయినా జైలుకువెళ్ళాల్సిందే..అనే ఒక హెచ్చరికను జారీ చేయడంతో అవినీతి రాజకీయ నేతల వెన్నులో చలిపుట్టించినట్టయింది కదా నేస్తమా..!







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి