13, ఏప్రిల్ 2015, సోమవారం

చీ..చీ.. ఇదేనా.. నా జీవితం..
తలచుకుంటే నా బతుకుపై నాకే జాలేస్తుంది..
నా బతుకుపై నాకే అసహ్యం వేస్తుంది..
ఎందుకు ఈ బతుకు బతకాలి నేను...
ఎవరికోసం ఈ బతుకు బతకాలి నేను..
ఎవరిని ఉద్దరించేందుకు బతకాలి ఈ బతుకు నేను..
ఎవరినీ ఒప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
ఎవరినీ మెప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
హు..అసమర్ధుడినే...
నిజంగా నేను అసమర్ధుడినే..
నన్ను కన్న తల్లిదండ్రులకు
నా పేగుబంధం పంచుకున్న అన్నదమ్ములకు
నాతో జీవితాన్ని పంచుకున్న భార్యకు
మా పేగుబంధాన్ని గుర్తుచేసే బిడ్డలకు
నేనేమీ చేయలేని అసమర్ధుడనే నేను
నిజంగా అసమర్ధుడినే... నేను
ఫార్టీ ప్లస్ చివరి దశకి వచ్చేసినా
ఇంకా నాకంటూ ఓ జీవితాన్ని
ఏర్పాటుచేసుకోలేని నిస్సహాయకుడను నేను..
ఎవరినీ పోషించే సత్తాలేని వెధవని నేను
ఆకలేస్తున్నా పట్టెడన్నం పెట్టమని
గట్టిగా అడిగే ధమ్మూ, ధైర్యం లేని దద్దమ్మను నేను
కన్న కూతురుకి కూడా స్వతహాగా
చాక్లెట్ కొనిచ్చే సామర్ధ్యం లేని కసాయి తండ్రిని నేను
ఇంకా ఎంతకాలం ఇలా నన్ను..
నా అసమర్ధతను, నా చేతకాని తనాన్ని భరించాలి నా వాళ్ళు
ఈ అత్తెసర బతుకుతోనే ఇంకెంత కాలం
నా జీవితాన్ని వెళ్ళదీయాలి నేను
లేదా.. నా జీవితానికి ఇక మోక్షం...
రాదా నా జీవిత తలుపును తట్టే ఆ లక్ష్మీకటాక్షం..!
(ఎవరి మెప్పుకోసమో..నా తప్పును కప్పిపుచ్చుకునేందుకో రాయలేదు నేను.. ఎవరో నన్ను ఉద్దరిస్తారని ఇది రాయలేదు.. ఎందుకో నామనసుకి బాధకలిగి నన్ను నేను ఆవిష్కరించుకుంటే నాకు మిగిలిన ఆవేదన అలా పెల్లుబికింది నా అంతరంగం పలికించిన మాటలు అంతే.. ఎవరూ నన్ను మరోలా అనుకోవద్దని నా మనవి) 

                                                                                                                                    @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి