2, ఆగస్టు 2015, ఆదివారం

అమ్మా..! నేనే మీకు భారమయ్యానా అమ్మా..!
=================================
అమ్మా.. అమ్మా..
అని గట్టిగా అరిచి నేనెవరినో
నీకు తెలియజేయాలని ఉందమ్మా..!
అప్పుడే మీకంత భారమయ్యానా
ఏంటమ్మా ఇంకా నేను
కళ్లు కూడా తెరవనే లేదుకదమ్మా..!
నాకిద్దరు ఆక్కలున్నప్పుడు
నన్ను పోషించే స్తోమత లేనప్పుడు
మరి నన్నెందుకు కన్నావమ్మా..!
నేను పుట్టిన నీ పొత్తిళ్ల
వాసన కూడా పోకుండానే
నేను మీకు భారమైపోయానమ్మా..!
ఏంటమ్మా ఈ ఘోరాతి ఘోరం
ఏంటమ్మా ఈ అన్యాయం
అని ప్రశ్నిస్తానని అనుకున్నావమ్మా..!
లేదు లేదు నేను ఎంతో అదృష్టవంతురాలినే
మీరు రోడ్డు పక్కన పడేయకుండా
ఐఎస్డీ వాళ్ళకి అప్పగించినందుకు
మీకు నా ధన్యవాదాలమ్మా..!
అమ్మా.. అమ్మా...
అని పదే పదే పిలిచి మన బంధం
నీకు తెలియజేయాలని నాకున్నా
అలా పిలిచే అదృష్టం ఆ దేవుడు
నాకింకా నేర్పలేదమ్మా ..!
ఏదేమైనా నన్ను నీ కడుపులోనే
చిదిమేయకుండా తొమ్మిదినెలలు
కష్టమైనా నన్ను మోసినందుకు
నీకు ధన్యవాదాలమ్మా..!
నేను కాళ్ళతో తన్నినా భరించి మరీ
నాకు జన్మనిచ్చినా నీకు పునర్జన్మే కదా
అందుకే నిన్ను చంపాననే అపవాది
నామీద పడకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలమ్మా..!
(ఆడపిల్లను కన్న వాళ్లు.. వారు భారమయ్యారని చెప్తూ పురిటిలోనే వారిని విసిరి వేస్తున్న సందర్భాలను చూసి నా హృదయం ఇలా చలించింది. జి కొండూరులో నిన్న ఇందుకు భిన్నంగా ఐఎస్డీ వాళ్లకు అప్పగించిన వైనం కొంత ఊరటే అయినా...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి